Chapter1: అరుణిమ హెల్లాస్ చేరుకుంటుందా?
అరుణిమ కలను కల కదా అని ఏమాత్రం తీసిపారేయకుండా తను పాఠశాలకు వెళ్ళడానికి ముందు కుమ్మరి పుల్లయ్య దగ్గరికి వెళ్లి ఒకసారి తన కుడిపాదాన్ని పరిశీలించడానికి అనుమతి అడిగింది. పుల్లయ్య సందేహాస్పందంగా ఒప్పుకున్నాడు. అక్కడే గుడిసె ముందు ఉన్న అరుగు మీద కూర్చుండగా అరుణిమ కింద తన మోకాళ్ళమీద కూర్చుని పుల్లయ్య కుడి పాదాన్ని పరిశీలించింది. అతని పాదానికి నిజంగానే ముళ్ళు గుచ్చుకున్న గాయం కనపడింది అరుణిమకి. అది చూసి నిర్ఘాంతపోయిన అరుణిమ తన ముఖకవళికలో ఏమాత్రం ఆశ్చర్యం కనపడకుండా పెద్దయ్య వెళ్ళొస్తాను అని చెప్పింది. అసలు అరుణిమ ఎందుకిలా చేసిందో అర్థం కానీ పుల్లయ్య దాని గురించి ఆలోచించడం మానేసి తన పనిలో తాను నిమఘ్నమయ్యాడు. అరుణిమ మాత్రం ఇది కేవలం యాదృచ్చికమా లేక దీని వెనక ఏదైనా ధృడమైన కారణం ఉందా అని ఆలోచించడం మొదలుపెట్టి, దీనికి సమాధానం కేవలం నా ఆలోచన వల్ల దొరకదు, నేను అందగత్తె మాతృభూమికి వెళ్లి తెలుసుకోవాల్సిందే అని నిర్ణయించుకుంది. అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది అని అర్థం చేసుకుని తను నేర్చుకోవాల్సిన విద్యలను గురించి ఒక జాబితా రాసుకుంది. అందులో ఎటు చూసిన ముఖ్యంగా నేర్చుకోవాల్సినది ఈదడం అని తెలుసుకుని, పొలంలో ఉన్న తన నాన్నగారిని తనకు ఈదడం నేర్పమని అడిగింది. అడగడమే ఆలస్యంగా వెంకటపతిరాజు వెంటనే ఆ గ్రామంగుండా పారే నదికి తీసుకెళ్లి గట్టుకి దగ్గర్లోనే ఉంచి మొదటి మెట్టుగా ముఖ్యమైన మెళకువలు తెలియచేసాడు. మరుసటి ఐదు రోజులలో ఈదటం పూర్తిగా నేర్చుకుంది అరుణిమ. ఆ తర్వాతి నుండి కమ్మరి నైపుణ్యాన్ని అభ్యసించడం మొదలుపెట్టి తను చేయాలనుకున్న ఆయుధం తయారు చేసింది. ఆ ఆయుధం చూడడానికి ఒక మెరుపు లాగా ఉంటుంది. ఈ ఆయుధాన్ని అందగత్తె చెవులకి ఉన్న దుద్దులలో చూసింది అరుణిమ. ఆమె పెట్టుకున్న దుద్దులు ఒక కండలు తిరిగిన మగమనిషి ఒళ్ళంతా ఒకటే గుడ్డతో కప్పుకుని ఈ మెరుపు లాంటి ఆయుధాన్ని ఎవరిపైనో సంధిస్తున్నట్టుగా పట్టుకుని ఒక మోకాలి పై కూర్చున్నట్టుగా ఉన్నాయి. అతను ఎవరు అని అరుణిమ అడిగినప్పుడు అతను వారి దైవం అని, వారందరు అవే దుద్దులు ధరించాలని చెప్పింది. ఆ దుద్దులని బాగా గమనించి చూసినప్పుడు ఈ ఆయుధం అరుణిమని ఆకర్షించడం వల్ల అటువంటి ఆయుధాన్ని తయారు చేసుకుంది. ఆరోజు రాత్రి కూర్చుని అందగత్తె దగ్గరినుండి దొంగిలించిన మార్గపు పటం యొక్క రేఖాచిత్రాన్ని గీసుకుంది. మరుసటి రోజు సాయంత్రం వెళ్లి అందగత్తెకు తెలియకుండా తనదగ్గర నుండి తీసుకున్న పటాన్ని ఎక్కడినుండి తీసిందో అక్కడే పెట్టింది. ఈ అన్ని రోజులు ఏరోజు తప్పకుండ ఏదో ఒకపూట అందగత్తెను కలుస్తూనే ఉంది తన గురించి ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయేమో అని. ఇలా రోజులు గడుస్తుండగానే అరుణిమ తాతగారైన రామరాజుగారి స్నేహితులు కూడా ఒకరు మరణించారు. అరుణిమ నేర్చుకోవాల్సిన విద్యలన్నీ నేర్చుకుని తన ప్రయాణానికి సిద్ధంగా ఉంది. తను బయలుదేరే ముందు రోజు తన అక్కతో ఇలా చెబుతుంది, "నేను తిరిగి వచ్చేవరకు రోజు నాలాగే తయారయ్యి అందగత్తె దగ్గరికి వెల్తుండు, ఎక్కువగా తన దేశం గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటాను, వారి భాష కూడా నేను మాట్లాడగలను, వారు ఎక్కువగా వాడే పదాలను తాటి ఆకులమీద రాసిపెట్టాను, నువ్వు కూడా నేర్చుకో, అప్పుడే తనకి ఏ అనుమానం రాకుండా ఉంటుంది. ఇంకా, తమరు సూర్యాస్తమయాలు అంటే ఇష్టపడాల్సిన అవసరం ఉంది అక్కగారు." అని నవ్వుతూ తన అక్కని కౌగిలించుకుంది. దానికి సమాధానంగా మధురిమ ఇలా అంది, "నువ్వు ఇలాంటి తిరకాసు ఏదో పెడతావనీ నువ్వు హెల్లెనికా భాష రాయడం మొదలు పెట్టినరోజునుండే నేను చదవడం మొదలుపెట్టాను. అలాగే సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అంటే ఇష్టం ఏర్పరుచుకున్నాను, అందంగా గీయగలను కూడా. నువ్వు తనదగ్గరినుండి దొంగిలించిన పటాన్ని మళ్ళీ అక్కడే పెట్టాలని వెళ్ళినపుడు నేను తనదగ్గరికి నీలాగా వెళ్లి తన దృష్టి నీవైపు నుండి మళ్ళించాను. అన్ని పనులు తమరొక్కరే జాగ్రత్తగా చేయలేరు కదా!" అంటూ నవ్వి "హోలా ట కలితెర" అని చెప్పింది. తన అక్క చూపిస్తున్న ప్రోత్సాహం చూసి అరుణిమకి చాలా సంతోషమేసింది. "బావ నీతో ప్రత్యేకంగా మాట్లాడాలి" అంటూ వాసుదేవరాజు వైపు నడిచింది. వాసుదేవరాజు గుండెల్లోనుండి పొంగుకొస్తున్న బాధని ఆపుకుంటూ తన కళ్ళు ఏమాత్రం చెమర్చకుండా "ఏమిటి" అన్నాడు. "మన ఈ అన్వేషణలో నేను తన గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నువ్వు ఇక్కడే ఉండి తననుండి మన గ్రామాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. తన ప్రతి కదలికను గమనిస్తూ ఉండు. మధురిమ కూడా నాలా తన దగ్గరికి వెళ్తుండడం అపాయం అయినా తప్పదు, అందుకే తనను కూడా జాగ్రత్తగా కాపాడు. నేను అక్కడికి చేరేలోపు, చేరిన తర్వాత జరిగే ప్రతి విషయం నేను తీసుకెళ్తున్న పావురాల ద్వారా సమాచారాన్ని చేరవేస్తుంటాను. ఆలోపు ఇక్కడేమైనా జరిగితే నువ్వు నాకు తెలియచేయి. ఈ విషయాలన్నీ అందగత్తెకు తెలియకుండా రహస్యంగా ఉంచాలి. నేను తిరిగి వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో తెలీదు, అంతవరకూ మన కుటుంబాలతో పాటు ఊరిని కూడా జాగ్రత్తగా కాపాడు. నేను వెళ్ళొస్తాను." అని చెప్పి అక్కడనుండి బయలుదేరి తన ఇంటికి వెళ్ళింది.
అరుణిమ నిజంగా బయలుదేరాల్సిన రోజు రానే వచ్చింది. తనకు కల రావడం ఒకందుకు మంచిదే అయినట్టు సూర్యోదయానికి ముందే బయలుదేరితే ఆరోజు రాత్రివరకు చాల దూరం ప్రయాణం చేయచ్చు, రోజు వృధా అవ్వకుండా అన్నట్టు, సూర్యుడికంటే ముందే నిద్రలేచి అందరికి వీడ్కోలు చెప్పింది. తన వెంట తన వస్తువులన్నీ మోయటానికి ఒక గాడిద, అవసరమైనప్పుడు సమాచారాన్ని చేరవేయడానికి తాను ఇన్నిరోజులు పెంచిన రెండు పావురాలు కూడా ఉన్నాయి. తన అత్యవసర వస్తువులను ఒక మూటలో కట్టి గాడిదమీద పెట్టింది. తన ఒక చేతిలో తన ఆయుధం, మరొక చేతిలో దారి చూపించే పటం ఉండగా రెండు భుజాలపైన తన రెండు పావురాలు వాలి ఉన్నాయి. ఊరికి పడమర దిశగా తన గమ్యం వైపు నడిచింది అరుణిమ. ఆరోజంతా ఎనిమిది యోజనాల దూరం నడిచి అడవి చేరింది.ఓపిక ఉన్నా చీకటిపడడంతో అడవిలో ప్రయాణం శ్రేయస్కరం కాదు అని తలచి, ఆరోజు రాత్రికి ఒక మంచి చెట్టు చూసుకుని ఎండుటాకులు పోగు చేసి మెత్తలా పరుచుకుంది. ఒక కాగడా వెలిగించి దగ్గర్లో భూమిలో చెక్కింది. గాడిదకు, పావురాలకు ఆహరం పెట్టాక, తను భోజనానికి కూర్చుంది. తన అమ్మగారు ఆ రోజుకి సరిపడా సద్ది పంపడంతో ఆపూటకి ఏ ఇబ్బంది కలగలేదు. రోజంతా నడవడం వల్ల అలసటతో భోజనం చేయగానే నిద్రపోయింది. అర్థరాత్రి సమయంలో తన వీపు కింద ఏదో పాకుతున్న స్పర్శ కలగడంతో ఉలిక్కిపడి నిద్రలేచింది. నిద్రలేపింది ఏమిటో ఎటుపోయిందో తెలియదు కానీ ఎదురుగా అడవి కుక్క ఒకటి తన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉండడం చూసింది అరుణిమ. తనవైపునుండి ఏ మాత్రం అధైర్యం కనపడిన ఇబ్బందే అని గ్రహించి వాడే విధానం తెలియకపోయిన తను తయారు చేసుకున్న ఆయుధాన్ని వంపు దగ్గర మధ్యలో రెండు చేతులతో పైకెత్తి పట్టుకుని నిలబడింది. ఇంతలో అరుణిమ వెనక ఉన్న చెట్టు మీదనుండి ఇంకో కుక్క తనపైకి దూకింది. అరుణిమ ఆయుధాన్ని ఎత్తి పట్టుకోవడం వల్ల పైవైపున్న పదునైన అంచు దాని గొంతులో పొడుచుకుంది, ఆ బరువుకి అరుణిమ ముందుకు పొంగిపోయింది. ఆయుధానికి కిందివైపున్న అంచు అరుణిమ ముందునుండి తనపైకి ఎగిరిన కుక్క కడుపులో పొడుచుకుంది. ఇలా ఏకధాటిగా రెండు కుక్కలను ఒకేసారి చంపేసి ఈ అనుభవంతో తను తయారు చేసుకున్న ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకుంది.. ఇంకా అక్కడే ఉంటే ఈ కుక్కలకు సంబంధించిన గుంపు రావచ్చు అనుకుని అక్కడినుండి బయలుదేరడానికి సిద్ధమవుతూ తన గాడిదను కట్టేసిన వైపు చూసింది. అరుణిమ చంపేసిన రెండు కుక్కలు ముందుగానే ఆ గాడిదను చంపేసి ఉండడంతో చేసేదిలేక ఆ జంతువుకి వీడ్కోలు పలికి తన వస్తువులను మూటకట్టి కుడి భుజంపైన పెట్టుకుని ముందుకు నడవసాగింది. తన రెండు పావురాలు అక్కడ అయిన శబ్దానికి అప్పటికే గాల్లో ఎగురుతూ అరుణిమ నడవడం చూసి తన భుజం మీద ఉన్న మూట మీద వాలాయి. గవ్యూతి దూరం నడిచాక అలసటగా అనిపించి నిద్రపోవడానికి మళ్ళీ ఒక స్థలం చూసుకుంది. ఈసారి అడవి జంతువులకు ఎలాంటి గుర్తులు తెలియకుండా కాగడా కూడా ఆర్పేసి పడుకుంది.
![]() |
| (Image source: Google) |
సూర్యకిరణాలు చెట్ల చాటునుండి నేరుగా అరుణిమ మొహం మీద పడడంతో ఆ వేడికి మెలకువ వచ్చింది తనకి. అప్పటివరకు అంతా మర్చిపోయి ఘాడనిద్రలో ఉన్న తను ఆ అడవిలో ఎందుకుందో ఒకక్షణం మర్చిపోయింది. తనతో పాటు తెచ్చుకున్న తన సొరకాయ సీసాలో ఉన్న నీళ్లతో మొహం శుభ్రం చేసుకుని సూర్యునికి నమస్కరించింది. ఆరోజు ఎంత ప్రయాణం చేయాలో చూసుకున్నాక ఆ అడవిలో ఏవైనా ఆహారపదార్థాలు దొరుకుతాయా అని వెతకసాగింది. ఆశ్చర్యంగా తన తండ్రి గీసి ఇచ్చిన పండ్లలో రెండు మూడు రకాలు తనకు దగ్గర్లోనే పడి ఉండడం గమనించింది. ఆ పండ్లకున్న ఆకులను చూసి చుట్టూ ఉన్న చెట్లను చూస్తే అక్కడ దగ్గర్లో వాటికి సంబందించిన చెట్లు ఏవి కనపడలేదు. ఎవరైనా పడేసుంటారా అని ఆలోచిస్తూనే వాటిని సేకరించి ఒక పండు తింటూ మిగతావాటిని తన మూటలో పెట్టుకుంది. అప్పటికే అడవిలో మంచి ఆహరం దొరికిన పావురాలు అరుణిమ ఎప్పుడు నడక మొదలు పెడుతుందా అని ఎదురు చూస్తున్నట్లుగా తను నడక మొదలు పెట్టగానే వచ్చి తన భుజం మీద వాలాయి.
![]() |
| (Image source: Google) |
ఆరోజంతా అడవిలోనే తన ప్రయాణం సాగింది. తన దగ్గరున్న పండ్లతో ఆకలి తీర్చుకుంటూఎలాంటి అలసట లేకుండా నడక సాగించింది. ఆ రోజు మధ్యాహ్నానికి ఆ అడవి గుండా పారే ఒక నదిని చేరుకుంది. స్నానం చేయాలనీ తన వస్తువులన్నీ ఒడ్డున పెట్టి నదిలో దిగింది. తను స్నానం చేస్తుండగా ఒక పాము అరుణిమ సంచిలో దూరి అందులోనే ఉండిపోయింది. ఇదంతా గమనించని అరుణిమ స్నానం అయిపోయాక వచ్చి తన సామాన్లు అన్ని తీసుకుని మళ్లీ బయలుదేరింది. దారి పొడవునా తనకు ఏదోకరకం పండ్లు కనపడేవి. అయితే ఆ పండ్లకు సంబందించిన చెట్లు ఎక్కడ కనపడకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కోతులు పడేసుంటాయి అనుకునేందుకు ఆ పండ్లపైన ఏ జంతువూ కొరికిన గుర్తులు లేవు. ఎవరైనా ఆ పండ్లని అక్కడ వేస్తున్నారా అని వెతికి చూస్తే ఎవరు కనపడట్లేదు తనకి. వీటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే తను బయలుదేరిన పని ఆలస్యం అవుతుందనుకుని అక్కడినుండి బయలుదేరి ఆ రోజంతా చాల హుషారుగా నడిచి సాయంత్రానికి ఆ అడవి చివరలో ఉన్న ఒక గ్రామాన్ని చేరుకుంది.
గుడిసెలు కనపడగానే ఆరోజు రాత్రికి అక్కడే బస చేయచ్చు అని సంతోషించి ఎవరైనా మనుషులు కనపడతారేమో అని ఎదురు చూడసాగింది. చీకటి పడుతున్నా ఎవరు కనపడకపోయేసరికి ఎవరి ఇంటి తలుపులైన తడదాము అనుకుని ఒక ఇంటి వైపు నడవసాగింది. అరుణిమ ఆ ఇంటి తలుపు తట్టేలోపు ఒక ముసలాయన వచ్చి అరుణిమ చేయి పట్టుకుని లాగి పక్కకు తీసుకొచ్చి, "ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఆ ఇంటి తలుపులు ఎందుకు తడుతున్నావు?" అని అడిగాడు. ఆ ముసలాయనను చూస్తే అరుణిమకు కాస్త భయం వేసింది. మనిషి చూస్తే తెల్లగా పాలిపోయి, ముడతలు పడిన చర్మంతో, గూని వల్ల శరీరం ఒంగిపోయి ఉన్నాడు, అయినా అరుణిమ చేయి పట్టి లాగినప్పుడు చాల బలంగా లాగాడు, నడవడం కూడా చాల హుషారుగా నడిచాడు. తను అడిగిన ప్రశ్నకి సమాధానంగా అరుణిమ, "నేను అడవికి అటువైపున్న పశుపతినాథపురం అని ఒక గ్రామం నుండి వస్తున్నాను, ఇక్కడికి చాల దూరంలో ఉన్న ఒక ప్రదేశానికి బయలుదేరాను, ఆ మార్గంలోనే ఈ గ్రామం కనపడితే ఈ రాత్రికి ఇక్కడే నిద్రపోదామని, ఎవరింట్లో అయినా చోటు కలిపిస్తారేమో అడుగుదామని తలుపు తట్టాను." అని చెప్పింది. అప్పటివరకు అరుణిమ దగ్గరున్న ఆయుధం గమనిస్తున్న ముసలాయన ఆ మాటలు వినగానే "మళ్లీ ఏమ్ చేయడానికి వచ్చావు, ఇప్పటికే ఊర్లో జనమంతా జీవశ్చవాల్లా ఉన్నారు. చావు దరిచేరక ఇలా బ్రతకడం చేతకాక ఇళ్ళల్లోనుండి బయటికి రావట్లేదు. ఇంకా ఏమాత్రం వివేకం ఉన్న ఈ రాత్రికి నిన్ను ఇక్కడ ఉండనిస్తారని ఎలా అనుకున్నావు, వెళ్ళిపో ఇక్కడినుండి, లేదంటే చంపేస్తాను." అని గట్టిగ అరిచాడు. అరుణిమకు ఇదంతా అర్థం కాలేదు. కానీ ఇంకాసేపు అక్కడే ఉంటే తనకేదైనా జరగచ్చు అని అక్కడినుండి త్వరగా బయలుదేరింది. అరుణిమ ఆ ఊరు దాటేసి కాస్త దూరం నడిచాక వీరిద్దరి సంభాషణ విన్న ఒక పిల్లవాడు అరుణిమను అనుసరించాడు. "అక్క ఆగండి." ఈ మాటలు విని ఆగి వెనక్కి తిరిగి చూసింది అరుణిమ. "మీరు ఇందాక ముసలయ్యతో మాట్లడడం చూసాను. క్షమించండి, మా ఊరికి ఈ మధ్యే ఒక వింత అనుభవం జరిగింది. అప్పటినుండి ఎవరైనా కొత్త మనుషులను చుస్తే భయపడుతున్నారు. అలాగే ముసలయ్య అంటున్న కానీ ఆయన నిజంగా ముసలాయన కాదు, నా తండ్రి. నా వయసు పన్నెండేళ్లే, ఇంకా మా నాన్న వయసు సరిగ్గా తెలీదు కానీ ఒక ముప్పది ఏళ్ళు ఉండచ్చు. ఈ మధ్య మా ఊరిలోకి ఏదో హెల్లస్ రాజ్యం అంట, అక్కడినుండి ఒక అందమైన యువతి వచ్చింది, తను ఏవో పరిశోధనలు చేస్తుంటుంది అని, ఆ పరిశోధనలో భాగంగానే మా ఊరి దగ్గర్లో ఉన్న అడవిలో దొరికే ఏవో మూలికలకోసం మా ఊరికి వచ్చిందని, ఇక్కడే కొన్నిరోజులు ఉండాలని చెప్తే మా ఊరి వాళ్ళు ఇక్కడే ఉండనిచ్చారు. అయితే ఆవిడ ఉన్నన్ని రోజులు ఎవరో ఒకరు అనారోగ్యపాలవ్వడం, ఆవిడ ఔషదాలు తీసుకుని మళ్ళీ శక్తిశాలులు అవ్వడం జరిగేది. కానీ కొన్ని రోజులు తర్వాత అందరి శరీరాలు ముసలిబారిపోయాయి. కొంతమంది శక్తి అలానే ఉన్న కొంతమంది ఏ పనులు చేయలేకపోతున్నారు. కొందరైతే వారి ముఖాలు ఎవరికీ చూపించలేక ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఆ శక్తి మిగిలిన వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు బయటికి వచ్చి అడవిలో ఏవైనా ఆహారపదార్థాలు తీసుకెళ్లి అందరికి పంచుతుంటారు. ఊరంతా ఇలా తయారయిపోయాక ఆ యువతి ఎవరికీ తెలియకుండ మా ఊరిని వదిలేసి వెళ్ళిపోయింది." అని చెప్పాడు. ఈ విషయం వినగానే అరుణిమకు ప్రపంచం తలకిందులైనట్టు అనిపించింది. తను తలచినట్టుగానే తన గ్రామప్రజలకు ఏదో ముప్పు రాబోతుందని గ్రహించి వెంటనే ఈ విషయం గురించి తన బావకు ఒక ఉత్తరం రాసి పంపాలనుకుంది. కానీ ఒక క్షణం ఆగి తనకు వచ్చిన అనుమానాన్ని తొలగించుకోడానికి ఆ పిల్లాడిని ఇలా అడిగింది. "ఇదంతా బాగానే ఉంది, మరి నువ్వు కూడా ఈఊరే కదా నువ్వు మామూలుగానే ఉన్నవుగా?" అంది అరుణిమ. "మీకు ఈ ప్రశ్న రావడం సమంజసమే, నిజమే నేను మా ఊరి వాళ్ళలాగా మారలేదు ఎందుకంటే నేను ఎప్పుడు ఆ యువతిని నమ్మలేదు, ఊరంతా ఏదైనా జబ్బొస్తే చాలు తన దగ్గరికి వెళ్లి ఔషదాలు తీసుకునే వాళ్ళు. నేను మాత్రం తన దగ్గర మందులు తీసుకున్నట్టు నటించి ఇంటికొచ్చి ఆ ఔషధాన్ని పడేసేవాడిని. ఇలా మా ఊర్లో ముగ్గురు అబ్బాయిలం మిగిలిపోయాము. ఇంకో ఇద్దరు అడవిలోనే ఉండిపోయారు. ఈరాత్రికి వారు అక్కడే ఉంటారు. మీరు అడవి గుండా వస్తున్నప్పుడే మిమ్మల్ని చూసి అనుసరించాను. మీకంటే మీ చేతిలో ఉన్న ఆయుధం నన్ను మీ వెంట వచ్చేలా చేసింది. ఈ ఆయుధపు ఆకారాన్ని ఆ యువతి చెవిదుద్దులలో చూసాను. మీరు ఆ యువతికి సంబందించిన వారే అయుంటారని అనుమానంతో ఇక్కడిదాకా వచ్చాను. కానీ మా నాన్నతో మీరు మాటాడినపుడు అర్థం అయింది మీకు ఆవిడకు ఏ సంబంధం లేదని." అని చెప్పాడు ఆ పిల్లాడు. ఇదంతా విన్న అరుణిమ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్కడే తన వస్తువులను కిందకి దించి, రాయడానికి తయారుగా ఉన్న తాటిఆకుల మీద తను రాయాల్సింది అంతా రాసి తన వెంట వచ్చిన తన పావురాల్లో ఒకదాని కాలికి ఆ ఉత్తరాన్ని కట్టి పంపింది. ఇంకా ఆలస్యం చేయకూడదు అని ఆ అందగత్తె ఊరికి ఎలాగైనా చేరాలని అక్కడినుండి లేచింది. "ఇంతకీ మీరెవరు అక్క? ఎక్కడికి వెళ్తున్నారు?" అడిగాడు ఆ పిల్లాడు. విషయమంతా చెప్పింది అరుణిమ. ఆ పిల్లాడు అరుణిమకు సహాయం చేయాలనుకున్నాడు. ఆరోజు రాత్రికి ఆ ముగ్గురు పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసుకున్న గుడిసెలో తనని ఉండమన్నాడు. అది ఊరికి కాస్త దూరంలో ఉండడం వల్ల అరుణిమ ఆరోజు రాత్రికి అక్కడే ఉండిపోయింది.
ఉదయాన్నే లేచి తొందరగా బయలుదేరాలి అనుకున్న అరుణిమ లేవగానే తన వస్తువులన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటుంటే తన ఆయుధం కనిపించలేదు తనకి. ఇదేమి కర్మరా బాబు, పిల్లవాణ్ణి నమ్మి తప్పు చేసానా అని బాధపడుతూ ఆయుధం కోసం గుడిసెంత వెతికి బయటికి వచ్చింది. ఇంతలో ఆ పిల్లాడు వచ్చి మళ్ళీ తన ఆయుధాన్ని తనకి ఇచ్చాడు. "మీకు చెప్పకుండా మీ ఆయుధాన్ని తీస్కెళ్ళినందుకు క్షమించండి అక్క, మేము దీనిని నమూనాగా వాడి ఇలాంటి ఆయుధాన్ని తయారు చేసుకున్నాం. మీకు తోడుగ మేము వస్తాము. దయచేసి కాదనకండి. మేము ఎప్పటినుండో చేయాలనుకునే పని మీరు చేస్తున్నారు. మమ్మల్ని కనీసం సహాయంగా ఉండనివ్వండి." అన్నాడు ఆ పిల్లాడు. "మీరందరు చిన్నపిల్లలు, మీకు ఎందుకు ఇదంతా. అంత దూరం నాతో ప్రయాణం చేయగలరా? సముద్ర ప్రయాణం కూడా చేయాలి. ఆ యువతి చెప్పిన మాటల ప్రకారం సముద్ర ప్రయాణాల్లో అందరికి ఆరోగ్యం సహకరించదు అని తెల్సింది. మీకేమైనా అయితే నాకు బాధగా ఉంటుంది కదా?" అంది అరుణిమ. "పర్వాలేదు అక్క, మేము అన్నింటికీ తెగించే ఉన్నాము. మా ఊరి ప్రజలకి ఏదైనా మంచి జరుగుతుంది అంటే మాకు అదే ఆనందం." అన్నాడు ఆ పిల్లాడు. మిగతా ఇద్దరు పిల్లలు ఆ పిల్లాడికి వంత పాడారు. చేసేది లేక అరుణిమ సరే అంది. ఆ రోజు నడవాల్సిన దారిని చూసుకుంది అరుణిమ. తను ముందు నడుస్తుండగా తన పావురం భుజం మీద వాలింది. ముగ్గురు పిల్లలు తన వెనకాల నడిచారు. "ఇంతకీ మీ పేర్లేంటి?" అడిగింది అరుణిమ. "మా పేర్లు, విక్రమార్క, ధనుంజయ, ప్రతాపుడు." చెప్పాడు విక్రమార్కుడు.
ఇంకా ఉంది...



Comments
Post a Comment