Chapter2: విక్రమార్కుడు, ప్రతాపుడు, ధనుంజయుడు నిజంగా పిల్లలేనా?

 "విక్రమ అరుణిమను మోసం చేస్తున్నామేమో అన్న ఆలోచన నన్ను కలచి వేస్తుంది. తను తన గ్రామప్రజల కోసం పడే తపన చూస్తుంటే నిజం చెప్పేయాలనిపిస్తుంది." గుసగుసలాడాడు ధనుంజయుడు. "ధనుంజయ! ఏమ్ మాట్లాడుతున్నావు? తనకి నిజం తెలిస్తే మనం ఎదురుచూస్తున్నా రోజు కోసం మళ్ళీ ఏళ్ల తరబడి వేచి చూడాలి. అయినా తనకు తన ప్రయాణంలో ఏ హాని జరగకుండా చూసుకోవడానికే కదా మనం తనతో వెళ్తున్నది. ఈ సమయంలో నువ్వు ఏ మాత్రం నోరు మెదపకుండా కేవలం అరుణిమను క్షేమంగా మన రాజ్యానికి ఎలా చేర్చాలి అనే విషయం పైన మాత్రమే ఏకాగ్రత ఉంచితే మన రాజ్యప్రజలకు అలాగే మనకు శ్రేయస్కరం. అర్థమైందా?" అరిచాడు విక్రమార్కుడు. "తెలుసు, నాక్కూడా తెలుసు ఇదంతా, కానీ ఎందుకు తనకు నిజం తెలియకూడదు? నిజం తెలిస్తే తను మనకు సహాయం చేయకపోదు అని నాకు అనిపించట్లేదు. నిజం తెలిసిన తప్పకుండ మన కార్యం నెరవేర్చి వెళ్తుంది అనుకుంటున్నాను." అన్నాడు ధనుంజయుడు. "నీకు అర్థం కావడంలేదా? అమ్మవారు చెప్పారు కదా, ఈ కార్యం నెరవేరాలి అంటే కర్తకు నిజం తెలియకపోవడం ఎంత ముఖ్యమో?" ధనుంజయుడి కళ్ళల్లోకి చూస్తూ అరిచాడు విక్రమార్కుడు. "సరేలే. ఇంక ఈ విషయం గురించి వదిలేయి. ఈ చిన్నపిల్లవాడి కాయంలో ఉంటే శరీరం అంతా ఇరుకుగా మోయలేని బండరాయి నామీద వేసినట్టు అనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఇలా నెలలు తరబడి అంటే అరుణిమకు నిజం చెప్పేసి నేను వెళ్ళిపోతాను, తాను క్షేమంగా వస్తే వచ్చింది, లేదంటే లేదు" అన్నాడు ధనుంజయుడు. "ధనుంజయ, చాల సేపటినుండి గమనిస్తున్నాను. ఏదో విధంగా మన ప్రయాణంలో కష్టాలు తెచ్చేలా ఉన్నావు నువ్వు. నిజమైన శత్రువులతో పోరాడవచ్చు కానీ ఇలా వెంటే ఉంటూ ఇబ్బంది పెట్టే స్నేహితులతో పోరాడడం కష్టమయ్యేలా ఉంది. నిజానికి మనకు అసలైన శత్రువుతో కూడా ఇప్పటివరకు ఏ ఇబ్బంది కలగలేదు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావో తెలీదు కానీ నీకు ఏ మాత్రం మన రాజ్యం మీద గౌరవం, ప్రేమాభిమానాలు ఉన్న ఇలా చేయవు. కనుక, నీకు ఈ కార్యంలో పాలుగొనడం ఇష్టం లేకపోతే తక్షణం ఇక్కడినుండి బయలుదేరవచ్చు. అరుణిమను క్షేమంగా మేము తీసుకొస్తాము." అప్పటివరకు మౌనంగా ఉన్న ప్రతాపుడు కోపంగా సమాధానం ఇచ్చాడు. 

(Image source: Google)

తన గ్రామప్రజలు క్షేమం గురించి ఆలోచిస్తూ హుషారుగా నడుస్తున్న అరుణిమకు వీరి సంభాషణ ఏ మాత్రం వినపడలేదు. "ఇంతకీ మీ గ్రామప్రజలంతా ఇలా తయారవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది?" విక్రమార్కుడిని ఉద్దేశించి అడిగింది అరుణిమ. "ఇలా జరగడానికి రెండేళ్ల సమయమే పట్టింది అక్క. మా ఊరంతా కొన్ని రోజులు బలహీనంగా తయారవ్వడం, ఆవిడ దగ్గర ఔషదాలు తీసుకొని మళ్ళీ శక్తివంతులుగా తయారవ్వడం, ఇలా ఏడాదిన్నర గడిచింది. చివరికి ఈ ఔషదాలవల్లనే ఇలా జరుగుతుందేమో అన్న చిన్న అనుమానం రావడంతో అందరు తీసుకోవడం మానేసాక ఒకరోజు రాత్రికే ఇలా తయారయ్యారు. ఆ యువతి గుడిసెకి వెళ్లి వెతికితే తను కనిపించలేదు. అప్పటినుండి ఇలా. ఇవాళ నీ రాక మాకు ఎంతో ధైర్యాన్ని ప్రసాదించింది. తొందరగా ఆవిడ ఎక్కడుందో తెలిస్తే మా ప్రజలను కాపాడుకోవచ్చు." అన్నాడు విక్రమార్కుడు. "అబద్ధాల మీద అబద్ధాలు." గొణిగాడు ధనుంజయుడు. విక్రమార్కుడు, ప్రతాపుడు ధనుంజయుడి వైపు విసురుగా తలతిప్పి కన్నెర్ర చేసారు. "వినపడలేదులే." వారికి మాత్రమే వినపడేలా అన్నాడు ధనుంజయుడు. ఆరోజు కూడా వారు వెళ్ళేదారిలో ఆహారానికి ఏ మాత్రం కొరత లేకుండా దారంతా పండ్లు పడిఉండడం గమనించింది అరుణిమ. "మీరు ఇది గమనించారా? విక్రమార్క, నేను మొదటిసారి అడవిలో అడుగు పెట్టినప్పట్నుండి నాకు ఇలా ఏదొకరకం పండ్లు కనిపిస్తూనే ఉన్నాయి. మొదటిరోజు నేను తెచ్చుకున్న ఆహరం ఉండడం వల్ల పట్టించుకోలేదు కానీ ఆ మరుసటి రోజునుండి చూస్తూనే ఉన్నాను, ఏ పూటకు ఆ పూట పండ్లు కనపడుతూనే ఉన్నాయి. ఏ జంతువూ కొరికి పడేసినట్టు కూడా లేదు, ఎవరో తాజాగా తెచ్చి పెట్టినట్టు ఉన్నాయి. కానీ ఎవరు కనపడట్లేదు, కనీసం ఆ పండ్లు పండే చెట్లు కూడా దగ్గర్లో కనపడట్లేదు. ఏమిటో ఆశ్చర్యంగా ఉంది." అంది అరుణిమ. విక్రమారుకుడు, ప్రతాపుడు ఒకరి మొహం ఒకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకుని, "ప్రక్రుతి ప్రసాదించిన ఆహరం ఆలోచించకుండా ఆస్వాదించండి అక్క." అని ఇద్దరు ఒకేసారి పలికి, వారి చేతిలో ఉన్న పండ్లను అరుణిమకు అందచేశారు. "హ హ! ధన్యవాదాలు." చిరునవ్వుతో ఆ పండ్లను అందుకుంది అరుణిమ. అప్పటివరకు అందగత్తెలైన దేవతలతో కాలం గడిపిన విక్రమార్కుడికి అరుణిమ చిరునవ్వు చూడగానే తన లక్ష్యాన్ని, తను ఒక దేవజాతికి చెందినవాడన్న విషయం, ఇలా అన్నీ మర్చిపోయి ఆ క్షణం అరుణిమతో ప్రేమలో పడినట్లు అనిపించింది. కానీ మరుక్షణమే తన లక్ష్యము గుర్తుకు వచ్చి తన భావాలన్నీ మనసులో అదిమిపెట్టి ముందుకు నడిచాడు.

(Image source: Google)


ఎప్పటికప్పుడు దొరుకుతున్న పండ్లను తింటూ మార్గమధ్యలో నదీప్రవాహాల దగ్గర నీరు తాగుతూ, చీకటి పడగానే సరిగ్గా వారి విశ్రాంతి కోసమే అన్నట్టు అక్కడక్కడా గుడిసెలు, ఇలా వారి ప్రయాణం నెల రోజులు ఏ అలసట లేకుండా సాగింది. అప్పటివరకు కాలినడకన అడవిలో ప్రయాణం కొనసాగించిన వాళ్ళు అప్పుడే సింధు సాగర తీరానికి చేరారు.అన్నిరోజులు అడవి వాతావరణంలో ప్రయాణించిన వారికి ఒకసారి ఆ విశాలమైన సముద్రాన్ని చూసేసరికి ఏదో కొత్త అనుభూతి కలిగింది.గట్టి నేలపైన నడిచి నడిచి ఆ సముద్రపు తీరంలో ఉన్న ఇసుకలో నడుస్తుంటే వారి కాళ్లకు హాయిగా ఉంది. సముద్రమునుండి వచ్చే ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కాసేపు అందరు మౌనంగా ఉండిపోయారు. అప్పటివరకు సముద్రం చూడని అరుణిమకు అది ఒక వింతలాగా అనిపించింది. అవతలివైపు నిజంగా ఇంకో ప్రపంచం ఉందా అన్న అనుమానం కలిగింది. అప్పుడే సాయంత్రం అవ్వడంతో ఇన్నిరోజుల తర్వాత సూర్యాస్తమయం చూసే అవకాశం వచ్చింది. ఆ అద్భుతాన్ని చూస్తుంటే అరుణిమకు అందగత్తె చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తను చెప్పినట్టు నిజంగానే సముద్రం సూర్యుణ్ణి మింగేస్తుందేమో అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. 

(Image source: Google)

(Image source: Google)


తన కళ్ళ ముందే సముద్రపు నీటిలో మునిగిపోతున్న సూర్యుణ్ణి మైమరచిపోయి చూస్తున్న అరుణిమను తట్టి పిలిచాడు విక్రమార్కుడు. "అక్క! ఇక్కడినుండి మనం సముద్రప్రయాణం చేయాలి అనుకుంటా కదా. చూస్తుంటే ఇక్కడ ఎవరూ లేరు, పడవలు కూడా లేవు, ఎలా?" అడిగాడు విక్రమార్కుడు. తనని అక్క అని పిలవడంలో తన ఇబ్బంది అర్థమైపోయిన ప్రతాపుడు తనలో తానే నవ్వుకున్నాడు. "పర్వాలేదు విక్రమ, నేను పడవను తయారు చేయగలను, కానీ తెడ్డు వేయడం నాకు రాదు, మేలో ఎవరికైనా వచ్చా? నాకు మా గ్రామంలో యువతి చెప్పిన దాని ప్రకారం తెరచాపతో నడిచే ఓడలు అయితే మన ప్రయాణం త్వరగా సాగుతుంది అని అర్థమైంది. మీకు తెరచాప వేయడం తెలుసు అంటే అది తయారు చేసుకుందాం." అంది అరుణిమ. విక్రమార్కుడు తను చిన్నపిల్లాడిలా నటించాల్సిన విషయం మరిచిపోయి, "సముద్ర ప్రయాణాలు మా ప్రజలకు పుట్టుకతో వచ్చే విద్యలు, మీరు ఎవరు నడుపుతారన్న సందేహం వదిలేసి పడవ తయారు చేయడం మొదలు పెట్టండి." అని ఉత్సాహంగా చెప్పాడు. విక్రమార్కుడి కళ్ళల్లోకి సూటిగా కాస్త వ్యంగంగా చూస్తూ  "అయితే మనకు కావాల్సిన కలపను మనం అడవి నుండి సేకరించాల్సి ఉంటుంది. ఇప్పుడే బయలుదేరి వెళ్లడం మంచిది. కావలిసినంత ఇప్పుడే  సేకరిస్తే సూర్యోదయం అవ్వగానే పని మొదలు పెట్టవచ్చు." అంది అరుణిమ. అలాగే అన్నట్టు తలఊపి అక్కడినుండి బయలుదేరారు అందరు. కాగడా వెలుగులో అరుణిమ తీసుకొచ్చిన తన ఆయుధంతో చెట్లను కొట్టి ఆ రాత్రికి కలప తయారు చేసుకుని ఆ రాత్రికి దాని మీదనే పడుకుని నిద్రపోయారు. ఉదయాన్నే నిద్రలేచి పని మొదలు పెట్టారు. అసలైన పడవను మొదలుపెడితే కానీ తెలియలేదు అరుణిమకు నలుగురికి సరిపోయే పడవ తయారు చేయడం అంటే కష్టమైన పని అని. అయినా సరే ఏమాత్రం వెనుతిరగకుండా పని కొనసాగించింది. పిల్లలు ముగ్గురు అడవిలోకి వెళ్లి ఆహరం తీసుకొస్తాము అని బయలుదేరారు. అరుణిమ పడవ తయారు చేస్తూ సాయంత్రానికి సగం పూర్తి చేసి అలసిపోయి నిద్రపోయింది. ఆహరం కోసం వెళ్లిన పిల్లలు తిరిగి వచ్చి అరుణిమ తయారు చేస్తున్న పడవను చూసి నిజంగా ఆశ్చర్యపోయారు. "అమ్మవారు అరుణిమను ఎన్నుకోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అయినాసరే ఇది ఇవాళ పూర్తి కాకపోతే మన ప్రయాణం ఆలస్యం అవుతుంది. తను నిద్రలేచేలోపు మనం పూర్తి చేద్దాం." అని వారు పడవను తయారుచేసి తెరచాప కోసం వారు తెచ్చుకున్న వారి బట్టలను పేర్చి ముడి వేసి తెర తయారు చేసారు.


మళ్ళీ సూర్యుడితో పాటు నిద్రలేచిన అరుణిమ తన కళ్ళముందు కనపడుతున్న పడవను చూసి ఆశ్చర్యపోయింది. తను నిద్రపోయేముందు అది పూర్తిగా లేదు కదా, ఎవరు చేసింటారు? అన్న అనుమానంతో పిల్లలకోసం వెతికింది. వారు అక్కడ కనపడకపోయేసరికి తన ఆయుధం కోసం వెతికింది. చాల సేపటి తర్వాత ఒక పెద్ద మూటతో వచ్చిన వారు ఇలా అన్నారు, "అక్క, మన ప్రయాణం ఈ సముద్రంలోనే నెల రోజులు పట్టచ్చు. అందుకే అడవినుండి ఆహరం సేకరించి తీసుకొచ్చాము. ఇది మనకు ఎన్నిరోజుల వరకు సరిపోతుందో తెలీదు కానీ ఈ పండ్లు పాడవ్వనంత వరకు మనకు ఆహరం గురించి బాధలేదు.". "అది సరే, ఇంతకీ ఈ పడవని ఎవరు పూర్తి చేసారు?" అడిగింది అరుణిమ. "మీరే కదా? మేము అడవిలోనుండి తిరిగి వచ్చేసరికి పూర్తి చేసి పడుకున్నారు, మమ్మల్ని అడగకుండా మా వస్త్రములను తెరచాపగా వాడేశారు అనుకుంటున్నాము." అన్నారు. అరుణిమకు ఏమ్ అర్థం కాలేదు, తను నిద్రలోకి జారుకునే ముందు ఆ పడవ సగం మాత్రమే తయారయింది. లేచి చూస్తే ఇలా. తన ముందు ఉన్న పిల్లలని అనుమానిద్దాం అంటే తనకి మనసు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా మనుషులు వచ్చి పూర్తి చేసింతర అనుకుంటూ తన రోజు మొదలు పెట్టింది. "ఎందుకు అంత ఆలోచిస్తున్నారు అక్క, మేరె కదా తయారు చేసారు, నిద్రలో మరిచిపోయింటారు, ఇంకా దాని గురించి మరిచిపోండి. మేము ఇలా ఆహరం కోసం అడవిలోకి వెళ్తున్నపుడు కొందరు నావికులు కనపడ్డారు, మాక్కూడా తెరచాప ఎలా వేయాలో నేర్పించమని అడిగితే చూపించారు. ఇక మేము కూడా సిద్ధంగా ఉన్నాము బయలుదేరడానికి. వెళ్దామా?" వారు తెచ్చిన ఆహరం అంత ఓడలో సర్దుతూ అన్నాడు ప్రతాపుడు. అయితే ఆ నావికులు పూర్తి చేసిఉంటారు అనుకుంటూ, "తప్పకుండ, ప్రతాప." అంది అరుణిమ. అరుణిమ ఓడలోకి ఎక్కగానే ముగ్గురు పిల్లలు సముద్రం ఎదురుగ నిలబడి, "ఓ పోసైడాన్, మా ప్రియమైన సముద్ర దేవుడా, ఓడల రక్షకుడా, మీకు ఇదే మా వందనం, మన దేశ ప్రజలకై మేము మొదలుపెట్టబోతున్న ఈ నౌకాయానంలో మీరే మాకు తోడుగా సహాయంగా ఉండి, శత్రువులు తలపెట్టాలి అనుకునే ప్రతీ కష్టమునుండి మమ్మల్ను కాపాడుకుంటూ, క్షేమంగా మన రాజ్యానికి చేర్చండి. అలాగే మీ మీద ప్రయాణించే ప్రతీ నౌకను వారి గమ్యానికి చేర్చండి." అని నమస్కరించి ముగ్గురు ఓడ ఎక్కారు. ప్రతాపుడు తెడ్డు వేయగా విక్రమార్కుడు అరుణిమకు దగ్గరగా కూర్చున్నాడు. ధనుంజయుడు మాత్రం వారికి దూరంగా విప్పని తెరచాపను అంటుకుని అంతం లేని ఆ సముద్రం వైపు ఎవరి గురించో ఎదురు చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డాడు.

(Image source: Google)



అరుణిమ ఊరు వదిలి వెళ్లినప్పటినుండి తనలో తాను లేని వాసుదేవరాజు తన గురించే ఆలోచిస్తూ పని చేస్తూ ఉండగా అరుణిమ నుంచి వచ్చిన ఉత్తరం చూసి తను క్షేమంగా ఉంది అన్న విషయం అర్థం చేసుకుని సంతోషించాడు. ఆ ఉత్తరంలో ఉన్నట్టుగా వారి గ్రామంలో ఏమి జరగకపోయినా వారి తాతగారి మరో స్నేహితుడు చనిపోయాడు, మధురిమ మాత్రం రోజు అందగత్తెను గమనించడానికి తన దగ్గరికి వెళ్తూనే ఉన్న అనుమానించతగ్గ పనులేమీ చెయ్యట్లేదు అందగత్తె. కానీ ముందు జాగరత్తగా ఎవరికైనా అనారోగ్యం చేస్తే అందగత్తె దగ్గరికి ఏ ఔషదంకోసం వెళ్ళకండి అని వేంకటపతిరాజు సహాయంతో ఊరిలో అందరికి ఉత్తర్వులు జారీ చేయించాడు వాసుదేవరాజు. ఇదంతా ఒక ఉత్తరంలో రాసి అరుణిమకు పంపాడు.
            
                                                                                                                        ...ఇంకా ఉంది.

Comments

Post a Comment

Popular Posts